జగన్క డపకు వెళ్లొచ్చాక సీన్ మొత్తం మారిపోయిందే

 


కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వైసీపీలో అంతర్మధనం మొదలైంది. పలువురు కార్పొరేటర్లు, కీలకనేతలు పార్టీకి దూరదూరంగా ఉంటున్నారు. కొందరు అలక పాన్పు ఎక్కారు. సీఎం జగన్‌ , ఎంపీ అవినాశ్‌రెడ్డితో ) ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా కొందరు పార్టీ మారేందుకు బయటికి రాలేని పరిస్థితి. అయితే కడప వైసీపీ నేతల్లో ఉన్న గూడుకట్టిన అసమ్మతి గుర్తించిన డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అండ్‌ కో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థంకాక అయోమయంలో పడ్డారని.. అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

సీన్ మొత్తం మారిపోయింది..!

సార్వత్రిక ఎన్నికల్లో కడప అసెంబ్లీ పోరు వన్‌సైడే ఉంటుంది. ‘నన్ను ఎవరూ అడ్డుకోలేరు, నాకు ఎవరూ అడ్డురారు.. నేనే హ్యాట్రిక్‌ విజయం సాధిస్తా’నంటూ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా రెండు నెలల క్రితం కూడా ఆత్మస్థైర్యంతో ఉన్నారు. కడప అంటే డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, సురేశ్‌బాబు మాత్రమే అన్నట్టుగా.. మేం చెప్పిందే వేదం, మాదే రాజ్యమనే భ్రమలో బతికారు. అయితే టీడీపీ అభ్యర్ధిగా మాధవీరెడ్డి ఎంట్రీ అయిన తరువాత మెల్లమెల్లగా అంజద్‌బాషా వర్గంలో బాగా మార్పు వచ్చినట్లు చెప్పుకొస్తున్నారు. నిన్నటిదాకా వార్‌ వన్‌సైడ్‌ అన్నట్లుగా గెలుపు మాదే అంటూ విర్రవీగారు. ఇప్పుడు సొంతింటిలోనే అసంతృప్తులు ఉండడం వైసీపీ కార్పొరేటర్లలోనే మనస్పర్ధలు, అనుమాన పొరపొచ్చాలు రావడంతో.. ఆ పార్టీలో ఒకరంటే ఒకరికి అపనమ్మకం ఏర్పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం వచ్చి 57 నెలలు అయింది. లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేటర్లుగా గెలిచాం.. జగన్‌పై పిచ్చితో పార్టీ కోసం శ్రమించాం. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి గౌరవం లేదు. పేరుకే కార్పొరేటర్లు.. పర్సంటేజీలు ఇస్తే తప్ప పనులు ఇవ్వలేదనే కొందరు కార్పొరేటర్లు ఆగ్రహంతో ఉన్నారు.