నేడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక


మహబూబ్‌నగర్‌ : 
ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ గురువారం జరగనుంది. ఇప్పటికే క్యాంపులకు తరలివెళ్లిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గురువారం నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకొని వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా, 10 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఏప్రిల్‌ 2న కౌటింగ్‌ జరగనుంది. ఉత్కంఠ మధ్య జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కసిరెడ్డి నారాయణరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉప ఎన్నిక షెడ్యూల్‌ వెలువడగా.. కాంగ్రెస్‌ తరఫున మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ తరఫున నవీన్‌కుమార్‌రెడ్డి బరిలో నిలిచారు. మరో స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్‌గౌడ్‌ కూడా బరిలో ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే హోరాహోరీ పోరు జరగనుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో జోష్‌ మీద ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీని దక్కించుకోవడం ద్వారా వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు.. బీఆర్‌ఎస్‌ సైతం తమ పార్టీకి ఉన్న బలంతో ఎమ్మెల్సీని గెలిపించుకోవాలని ఆశిస్తోంది. రెండు పార్టీలు ఇప్పటికే తమ ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలించాయు. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్‌ బలం తక్కువగానే ఉన్నప్పటికీ ఇటీవల పలువురు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు హస్తం కండువా కప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

పార్టీల బలాబలాలివే….

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 2021లో ఎన్నిక జరగ్గా.. అప్పడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ మాత్రమే బరిలో నిలిచింది. బలం తక్కువగా ఉండడంతో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ పోటీకి దూరంగా ఉంది. దీంతో ఆ ఎన్నిక ఏకగ్రీవమైంది. అప్పట్లో మొత్తం 1445 మందికి ఓటు హక్కు ఉండగా.. బీఆర్‌ఎ్‌సకు 1039, కాంగ్రె్‌సకు 241, బీజేపీ, ఇతరులకు కలిపి 165 మంది సభ్యుల బలం ఉంది. అయితే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొంతమంది స్ధానిక సంస్థల సభ్యులు బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరడంతో ఆ పార్టీ బలం స్వల్పంగా పెరిగింది. ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలయ్యే సమయానికి బీఆర్‌ఎ్‌సకు 925, కాంగ్రె్‌సకు 390, బీజేపీ, ఇతర పార్టీలకు కలిపి 120 మందిపైగా సభ్యుల బలం ఉందన్న అంచనాలున్నాయి. కొంతమంది సభ్యులు మరణించడం లేదా అనర్హత వేటు వేయడం వల్ల 2021 ఓట్లకు, 2024 ఓట్లకు మధ్య కొంత వ్యత్యాసం ఏర్పడింది.

నేడు కొడంగల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి

కోస్గి రూరల్‌/కొడంగల్‌: ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ నేపథ్యంలో కొడంగల్‌ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌ అఫిషియో హోదాలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు గురువారం ఆయన కొడంగల్‌ రానున్నారు. ఎంపీడీవో కార్యాలయంలోని పోలింగ్‌ కేంద్రంలో సీఎం రేవంత్‌ ఓటు వేయనున్నారు. ఈ కేంద్రంలో కొడంగల్‌, దౌల్తాబాద్‌, బొంరా్‌సపేట్‌ మండలాలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు, జట్పీటీసీ సభ్యులు, కొడంగల్‌ మునిసిపల్‌ కౌన్సిలర్లు కలిపి మొత్తం 56 మంది ఓటు వేయనున్నారు.