తన భర్త దేశభక్తుడు, ధైర్యవంతుడంటూ కితాబు

 


ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైన నేపథ్యంలో ఆయన అర్ధాంగి బుధవారం కీలక ప్రకటన చేశారు. ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను కేజ్రీవాల్ గురువారం కోర్టులో చెబుతారని అన్నారు. 
మద్యం కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటివరకూ 250 సార్లకు పైగా సోదాలు జరిపింది. ఎందులోనూ వారికి ఏమీ దొరకలేదు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 28న కోర్టులో అన్ని నిజాలు వెల్లడిచేస్తానని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. లిక్కర్ కుంభకోణం డబ్బు ఎక్కడుందో ఆయన న్యాయస్థానంలో చెబుతారు. అందుకు తగిన ఆధారాలు కూడా ఇస్తారు’’ అని సీఎం అర్ధాంగి తెలిపారు.  తన భర్త నిజమైన దేశభక్తుడు, ధైర్యవంతుడని సునీత కేజ్రీవాల్ అన్నారు. ‘‘నా భర్తను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన మధుమేహంతో బాధపడుతున్నారు. కస్టడీలోనూ ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచే నీటి సమస్యను నివారించాలని రెండు రోజుల క్రితం మంత్రి ఆతిశీకి లేఖ రాశారు. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమస్యగా మారుస్తోంది. ఆయనపై కేసులు పెడుతోంది. ఢిల్లీని నాశనం చేయాలని వారు (కేంద్రం) కోరుకుంటున్నారు. ఈ పరిణామాలతో ఆయన ఆందోళనకు గురవుతున్నారు’’ అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం విధానం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ ఈ నెల 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కస్టడీ గడువు ముగుస్తుండటంతో అధికారులు ఆయననను నేడు కోర్టులో హాజరుపరచనున్నారు.