''బిహార్ రాజకీయాల్లో 30 ఏళ్ల అనుభవమున్న పార్టీ ఆర్జేడీ. అయినప్పుటికీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి కుమారుడు మూడో స్థానంలో నిలిచారు. అప్పుడు జన్ సురాజ్‌ను తప్పుపట్టగలరా..? బెలగంజ్‌లో ఓ వర్గం ఓట్లు జేడీ(యూ) అభ్యర్థికే పడ్డాయి. నాలుగు స్థానాల్లో పోలింగ్ అయిన ఓట్లలో 10 శాతం మా పార్టీ దక్కాయి. దశాబ్దాల పాలనలో బిహార్ వెనుకబాటుతనాన్ని నిర్మూలించడంలో విఫలమైన భాజపా సంకీర్ణ ప్రభుత్వం.. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ఆందోళన కలిగించే విషయం'' అని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.
''బిహార్‌లో అతి పెద్ద పార్టీ అయిన ఆర్జేడీతో మేము పోటీపడటం లేదు. ఎన్డీయేతో మాత్రమే పోటీపడుతున్నాం. ఈ విషయాన్ని మేము ముందు నుంచి చెబుతున్నాం. మా పోరాటం ఎన్టీయేతోనే. తమది పెద్ద పార్టీ అని సీఎం నీతీశ్ కుమార్ చెప్పుకుంటున్నా.. ఆయన అంత ప్రభావం చూపే వ్యక్తిలా మేము భావించడం లేదు. మొత్తం ఓట్లలో ఆయన పార్టీకి 11 శాతం మాత్రమే దక్కాయి. వచ్చే ఏడాది రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ ఒంటరిగా పోటీ చేయనుంది'' అని తెలిపారు. కాగా.. ప్రశాంత్ కిశోర్ అక్టోబరులో ప్రారంభించిన జన్ సురాజ్ పార్టీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగింది. కానీ, నాలుగు స్థానాల్లోనూ ఓటమి చవి చూసింది.