పిల్లల ఆరోగ్యం దేశ వికాసానికి సౌభాగ్యం- డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ రాగిణి

పిల్లల ఆరోగ్యం దేశ వికాసానికి సౌభాగ్యం- డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ రాగిణి 

రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా మంగళవారం మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ రాగిణి ఆధ్వర్యంలో మద్దికేర కె.వి.ఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వైద్య ఆరోగ్య పరిక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం దేశ వికాసానికి సౌభాగ్యమని అందులో భాగంగా మండలంలోని ఆరు నెలల నుండి 18 సంవత్సరం లోపల పిల్లలందరికీ అంగన్వాడి మరియు అన్ని పాఠశాలలందు ఉన్న విద్యార్థులకు పుట్టుకతో వచ్చే లోపాలు, చిన్నతనంలో వచ్చు పౌష్టికాహార లోపాలు, చిన్నతనంలో వచ్చు రోగాలు, వయసుకు తగ్గ శారీరక, మానసిక పెరుగుదల లేకపోవడం, అంగవైకల్య లక్షణాలు వంటి ఏదైనా లోపాలు ఉంటే పరీక్షలు నిర్వహించి చికిత్స అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పిల్లవానికి ఆరోగ్య ప్రగతి రికార్డును అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ వారి ఆరోగ్య ప్రగతిని వైద్య ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, మంచి అలవాట్లు, ప్రభుత్వం అందించే వైద్య ఆరోగ్య సేవలు, లింగ వివక్షత, బాల్య వివాహాలు, మంచి స్పర్శ చెడు స్పర్శ, బాలిక విద్య, పోషకాహార ప్రాముఖ్యతలపై ఆరోగ్య విద్య అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నిరంజన్ బాబు, హెల్త్ డికేటర్ అక్బర్ బాషా, ఆరోగ్య పర్యవేక్షకులు కృష్ణమ్మ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అరుణ, అంజలి, స్కూల్ హెడ్మాస్టర్ అజరయ్య బాబు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.