*అదానీకి వ్యతిరేకంగా మాట్లాడితే మోదీ జైల్లో వేస్తారని కేసీఆర్ కుటుంబం భయపడుతుంది : సీఎం రేవంత్ రెడ్డి*

*అదానీకి వ్యతిరేకంగా మాట్లాడితే మోదీ జైల్లో వేస్తారని కేసీఆర్ కుటుంబం భయపడుతుంది : సీఎం రేవంత్ రెడ్డి* 



ప్రధాని, అదానీ అనుబంధం దేశ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. దేశంలో వ్యాపారం చేయాలంటే లంచం ఇవ్వాలని అనే పరిస్థితిని తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు

అదానీ – ప్రధాని కలిసి దేశ పరువు తీశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్లపై తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ కు ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మా డిమాండ్ కోసం నిరసన తెలపడం, చట్ట సభలను స్తంభింపచేయడం చేస్తాం. ఎన్ని నిరసనలు చేసినా మోదీ దిగిరావడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చింది. దేశం కోసం రోడ్డెక్కుతాం.. చట్ట సభల్లో నిరసన తెలియజేస్తాం. బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి నిరసన ఎలా చేస్తాడు అంటున్నారు. నేను చేయను.. మరి మీరు చేయండి. అదానీ విషయంలో కేసీఆర్ స్టాండ్ ఏంటో చెప్పాలి. బీజేపీ పెద్దల కాళ్లు మొక్కి అరెస్టులను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు వైపా..? అదానీ- ప్రధాని వైపా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చెప్పాలంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అదానీకి వ్యతిరేకంగా మాట్లాడితే మోదీ జైల్లో వేస్తారని కేసీఆర్ కుటుంబం భయపడుతుందని ఎద్దేవా చేశారు.